చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని గోండియా ప్రాంతం చాంద్‌సురోజ్ అనే గ్రామానికి చెందిన కాసీలం జానకీబాయి, ఆమె కుటుంబ సభ్యులు బ్రతుకు దెరువు నిమిత్తం నెల రోజుల కిందట నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని చందానగర్ ఫ్రెండ్స్ కాలనీ శ్రీదేవి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు. జానకీబాయి స్థానికంగా కూలి పనులు చేస్తోంది. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. కాగా ఈ నెల 3వ తేదీన పెద్ద కుమార్తె కాసీలం మీనా (18) రాత్రి 9 గంటల సమయంలో భోజనం ముగిశాక ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. అనంతరం ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అన్ని చోట్లా గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో వారు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
