నమస్తే శేరిలింగంపల్లి: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఇద్దరు కార్మికులు విషవాయువులతో ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కొండాపూర్ గౌతమీ ఎన్ క్లేవ్ లో సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసేందుకు ఇద్దరు పారిశుధ్య కార్మికులు సెప్టిక్ ట్యాంకులోకి దిగారు. సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే ముందు రసాయనిక మందులను వేశారు. వెంటనే సెప్టిక్ ట్యాంకులోకి దిగిన పారిశుధ్య కార్మికులకు విష వాయవులు కారణంగా ఊపిరాడక మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతులు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం అక్కోరం తండాకు చెందిన అంజి, నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముంజ తండాకు చెందిన శ్రీనివాస్ లుగా గుర్తించారు. వీరు సైదాబాద్ సింగరేణి కాలనీలో నివాసం ఉంటూ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. రోజూ మాదిరిగానే విధి నిర్వహణలో భాగంగా సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసేందుకు కొండాపూర్ కు వచ్చి మృత్యువాతకు గురయ్యారు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో సెప్టిక్ ట్యాంక్ లో నుండి మృతులను వెలుపలికి తీశారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







