శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వృద్ధుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ నంబర్ 1 సమీపంలో ఆగస్టు 26వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆ వృద్ధున్ని చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలోనే ఆ వృద్ధుడు చికిత్స పొందుతూ సెప్టెంబర్ 5వ తేదీన మృతి చెందాడు. దీంతో అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని వయస్సు సుమారుగా 70 నుంచి 75 ఏళ్లు ఉంటుందని, అతను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడని, ఎవరైనా గుర్తు పట్టదలిస్తే తమన సంప్రదించాలని పోలీసులు సూచించారు.






