ఎర్రజెండా పట్టి 40 ఏళ్లుగా ప్రజా పోరాటం.. మల్లాని యాదగిరి కుమార్‌కు ఘన నివాళి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎర్రజెండా పట్టి సమాజ మార్పు కోసం జీవితాంతం పోరాడిన మల్లాని యాదగిరి కుమార్‌ చిరస్మరణీయుడని ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ అన్నారు. మియాపూర్ అంబేద్కర్ నగర్‌కు చెందిన ఎంసిపిఐ(యు) సీనియర్ నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యుడు మల్లాని యాదగిరి కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ఆగస్టు 14న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన అంత్యక్రియల సందర్భంగా మియాపూర్ అంబేద్కర్ నగర్ నుంచి శ్మ‌శాన వాటిక వరకు ఎంసిపిఐ(యు) నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ.. ఎంసిపిఐ(యు) వ్యవస్థాపక సమావేశం సమయంలోనే మియాపూర్ ప్రాంతంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న యాదగిరి కుమార్ సుమారు 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో జరిగిన భూ పోరాటాలు, ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తాండ్ర కుమార్‌తో కలిసి వలస జీవులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు సాధించేందుకు, ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు అందించేందుకు ఆయన ధైర్యంగా పోరాడారని తెలిపారు. కులం, మతం, అవినీతి, దోపిడీతో కూడిన వ్యవస్థను మార్చాలనే లక్ష్యంతో యాదగిరి కుమార్ ఎర్రజెండా పట్టి నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహించారని రమేష్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ నైతిక విలువలతో, ఆదర్శప్రాయంగా జీవించారని పేర్కొన్నారు.

కష్టజీవులు, పేద ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు యాదగిరి కుమార్ ఆశయాలను సమాజం స్మరించుకుంటుందని మైదం శెట్టి రమేష్ అన్నారు. మల్లాని యాదగిరి కుమార్ మృతి విషయం తెలుసుకున్న ఎంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ మియాపూర్ అంబేద్కర్ నగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. యాదగిరి కుమార్ భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మియాపూర్ ప్రాంతంలో జరిగిన అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించి యాదగిరి కుమార్ ఆదర్శంగా నిలిచారని అశోక్ ఓంకార్ అన్నారు. ఆయన ప్రజా ఉద్యమాలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్, కుంభం సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కర్ర దానయ్య, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, తాండ్ర కళావతి, కమిటీ సభ్యులు పి. భాగ్యమ్మ, యార్లగడ్డ రాంబాబు, జి. శివాని, రంగస్వామి, బి. విమల, జి. లలిత, బి.కె. నారాయణ, కన్న శ్రీనివాస్, నిమ్మక నాగభూషణం, ఇసాక్, డప్పు రాములు, డి. శ్రీనివాసులు, డి. మధుసూదన్, ఆకుల రమేష్, రాజు, భూసాని రవి, మౌలానా, ఇక్రాన్ షేక్, గీసపాక మహేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొని యాదగిరి కుమార్‌కు నివాళులర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here