శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండావందనం సమర్పించారు. అనంతరం ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యాదవ కో-ఆపరేటివ్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. అమరవీరుల త్యాగాల పునాదులపై నిర్మితమైన భారతదేశం నేడు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ముందుకు తీసుకెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత అని అన్నారు. భారత సైనికుల నిరంతర పోరాటం వల్లే ప్రజలు సురక్షితంగా జీవిస్తున్నారని గాంధీ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న స్వేచ్ఛను కాపాడుకుంటూ, ప్రగతి పథంలో పయనిస్తున్న నవభారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుత పౌరులుగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్రాన్ని, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని గాంధీ తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని, శేరిలింగంపల్లి నియోజకవర్గ సమగ్ర, సంతులిత అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. మన ప్రతి శ్వాసలో దేశభక్తి.. మన ప్రతి అడుగులో నవభారత పురోగతి అనే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ శాంతి, సహనం, సౌభ్రాతృత్వాలను కాపాడాలని, ప్రపంచ యవనికపై భారతదేశ కీర్తి పతాకాన్ని మరింత ఎత్తుకు ఎగురవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాంధీ అన్నారు.





