శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్‌లోని వేమన కాలనీ, దీప్తిశ్రీనగర్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, శంకర్ నగర్ ఫేజ్-1, శంకర్ నగర్ ఫేజ్-2, శివాజీ నగర్, చందానగర్, వెంకటాద్రి నగర్, సత్య ఎన్‌క్లేవ్ తదితర కాలనీల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయా కాలనీల్లో మువ్వన్నెల జెండాలను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన, దేశభక్తి నినాదాలతో ఆయా ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వేలాది మంది మహనీయులు, అమరవీరుల త్యాగాల ఫలితమని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకుంటూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. చందానగర్ డివిజన్‌లోని కాలనీల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





