శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని ఓ లాడ్జిలో 47 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్ మండలం విట్టల్‌వాడి తండాకు చెందిన పి. కిషన్ నాయక్ (47) చందానగర్ ఇందిరానగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తూ టీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12న స్వగ్రామానికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కిషన్ నాయక్ తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆగస్టు 14న సాయంత్రం 5.30 గంటల సమయంలో చందానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయన కుమారుడు నవీన్‌కు ఫోన్ చేసి వివరాలు తెలిపారు. చందానగర్‌లోని ఎన్‌హెచ్-65 రెసిడెన్సీ లాడ్జిలోని 209వ గదిలో కిషన్ నాయక్ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న నవీన్ లాడ్జికి వెళ్లి తన తండ్రి మృతదేహాన్ని గుర్తించాడు. గత ఏడాది కాలంగా కిషన్ నాయక్ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలం సాధారణంగా ఉంటూ, ఆ తర్వాత కొంతకాలం అసాధారణంగా ప్రవర్తించేవారని, అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు కూడా ఉందని నవీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తన తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నట్లు నవీన్ తెలిపాడు. తన తండ్రి మృతిపై ఎలాంటి అనుమానం లేదని, పోలీసులు చట్ట ప్రకారం విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు క్రైమ్ నంబర్ 881/2026గా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





