మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మద్యం మత్తులో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్విచక్ర వాహనం నడిపించడంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన ఓ యువకుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన యువకులు శివ (20), ప్రశాంత్(22), విజయ్(22)లు నగరంలోని యూసుఫ్‌గూడలో ఉంటున్నారు. ముగ్గురూ విద్యార్థులే. శివ సూరారంలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. కాగా గురువారం అర్థరాత్రి వారు యూసుఫ్‌గూడలోని తమ రూమ్‌లో ప్రశాంత్ బర్త్ డే సందర్భంగా పార్టీ చేసుకున్నారు. అనంతరం ఉదయం 3.30 గంటల సమయంలో శివ, ప్రశాంత్, విజయ్ లు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 నుంచి ఐటీసీ కోహినూర్ వైపు ద్విచక్రవాహనం స్ప్లెండర్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వస్తున్నారు. మార్గమధ్యలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి ఆనుకుని ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై చివర్లో వారి వాహనం అదుపు తప్పింది. ఈ క్రమంలో వాహనం డివైడర్‌ను ఢీకొట్టగా ముగ్గురికీ గాయలయ్యాయి. శివ వాహనం నడిపిస్తున్నాడు. దీంతో అతని తీవ్ర గాయాలయ్యాయి. అతను మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రశాంత్, విజయ్‌లకు గాయాలై వారు కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

కాగా ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నారని, అందువల్లే వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొందని పోలీసులు తెలిపారు. వాహనం నడుపుతున్న శివకు డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నారు. అయినప్పటికీ శివను వాహనం నడిపేలా ప్రోత్సహించి ప్రమాదానికి కారణమైన ప్రశాంత్, విజయ్ లపై 304-II, 109 IPC, 184, 185, 188 MV Act ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
