శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇటీవల చోటు చేసుకున్న ఓ ప్రమాద సంఘటనలో వ్యక్తి మృతికి కారణమైన వాహన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సంఘటన అనంతరం తప్పించుకుని ఊటీ చేరుకోగా, పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని టోలిచౌకి ఎస్ఏ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్దుల్ నవీద్ (44)గా గుర్తించారు. అతను డేటా సెంటర్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కాగా అతను కేబుల్ బ్రిడ్జిపై కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ఓ వ్యక్తిని ఢీకొట్టి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సామాజిక మాధ్యమాలు, మీడియాలో వచ్చిన వార్తలను చూసిన అతను భయపడి తనకు ఉన్న వేరే కారులో 19వ తేదీన ఫ్యామిలీతో సహా పారిపోయాడు. మొదట అతను కొత్తూరు జహంగీర్ దర్గాకు వెళ్లి తరువాత అక్కడి నుంచి బెంగళూరు హైవే మీదుగా మైసూర్‌కు చేరుకున్నాడు. అక్కడ ఒక రోజు గడిపిన అనంతరం ఊటీకి వెళ్లి మూడు రోజులు హోటల్‌లో నివాసం ఉన్నాడు. కాగా అతని ఫోన్‌ను ట్రాక్ చేయడం ద్వారా కదలికలను గుర్తించిన పోలీసులు అతను ఊటీలో ఉన్నట్లు నిర్దారించుకుని ప్రత్యేక బృందంతో వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మాదాపూర్‌కు చేరుకుని పోలీస్ స్టేషన్‌లో హాజరు పరిచారు. ఈ మేరకు పోలీసులు నిందితున్ని రిమాండ్‌కు తరలించారు.






