శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, శేరిలింగంపల్లి మండలంలో అక్రమంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కోరుతూ AIFDS గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి (DEO) సుసేందర్ రావుకి వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రాన్ని స్వీకరించిన DEO సుసేందర్ రావు సమస్యలపై సానుకూలంగా స్పందించారు. మియాపూర్ ZPHS భవన నిర్మాణ పనులు, అక్రమ ప్రైవేట్ స్కూళ్ల అంశంపై వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ మియాపూర్ ZPHSకు 2023లో రూ.1.51 కోట్లతో శిలాఫలకం వేసి పాత భవనాన్ని కూల్చివేశారు. కానీ కొత్త భవన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 1000 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో 24 గదులకు గాను కేవలం 9 గదులతోనే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనం పూర్తి చేయాలి.. అని కోరారు. అలాగే శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ పరిసరాల్లో సుమారు 20 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయని తెలిపారు. నేషనల్, గ్లోబల్, టెక్నో అనే ఆకర్షణీయమైన పేర్లతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని, పుస్తకాలు, యూనిఫాం పేరుతో అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. స్థానిక MEO ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, వెంటనే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో AIFDS గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎస్.ఈశ్వర్, కమిటీ సభ్యులు JD గణేష్, దుర్గాప్రసాద్, జాస్మిన్ రాజ్, వివేక్ హర్షా, శ్రీ రామ్, వేదవర్షిత్, హర్షిత తదితరులు పాల్గొన్నారు.





