శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలకు గురైన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చత్తీస్గడ్కు చెందిన రూపక్ త్రిపాఠి (30) కేపీహెచ్బీలోని ఇండిస్ వన్ సిటీలో నివాసం ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే అతను ఆగస్టు 9వ తేదీన ఉదయం 4.30 గంటల సమయంలో వైభవ్ పాటిల్, ఇషాన్ త్రిపాఠి, యష్ రాజ్ సింగ్ అనే ఇతర సాఫ్ట్వేర్ ఉద్యోగులతో కలిసి గచ్చిబౌలిలోని టి హబ్ వద్ద కారు (CG04NR4222)లో ప్రయాణం చేస్తున్నాడు. అదే సమయంలో కారు వేగంగా టర్న్ తీసుకోవడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో రూపక్ తలకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రూపక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






