- నూతన సంవత్సర వేడుకలు ఈసారి ప్రశాంతం
- కమిషనరేట్ పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
- 931 మందిపై కేసులు నమోదు, ఎక్కువ కేసులు ఐటీ కారిడార్ పరిధిలోనే
- ప్రజలకు సీపీ సజ్జనార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోలేదని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 నుంచి జనవరి 1వ తేదీ వరకు వందలాది మంది పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు చర్యలు నిర్వహించామని తెలిపారు. అందులో భాగంగానే కమిషనరేట్ పరిధిలో పలు చోట్ల ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామని, ఆ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మొత్తం 931 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అరెస్టయిన వారిని కోర్టులో హాజరు పరచనున్నామని వివరించారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సీజ్ చేశామని ఆ వివరాలను సంబంధిత ఆర్‌టీఏలకు తెలియజేశామని అన్నారు. ఇందులో భాగంగా మొత్తం 931 మందిలో 472 మందిలో ఆల్కహాల్ మోతాదు 100 ఎంజీ పర్ 100 ఎంఎల్ వచ్చిందని, మరో 19 మందిలో 300 ఎంజీ, ఇంకో 7 మందిలో 500 ఎంజీ రీడింగ్ వచ్చిందని తెలిపారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి, నార్సింగి, రాయదుర్గం, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లోనే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోలేదని, కనుక ఈసారి ఇన్సిడెంట్ ఫ్రీ, యాక్సిడెంట్ ఫ్రీ వేడుకలు జరిగాయని తెలిపారు. రహదారులపై సురక్షితంగా ప్రయాణం చేయడంలో పోలీసులకు ప్రజలు సహకరించినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారాంతం సందర్భంగా శని, ఆది వారాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కొనసాగిస్తామని అన్నారు. సైబరాద్ పోలీసుల తరఫున ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.






