శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మద్యం సేవించేందుకు ఓ వ్యక్తి వెంట వెళ్లిన మహిళను ఆ వ్యక్తి లైంగికంగా వేధించాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూన్ 23వ తేదీన 23 ఏళ్ల ఓ యువతి మద్యం సేవించేందుకు గచ్చిబౌలిలో ఉన్న ఓ వైన్ షాపు వద్దకు చేరుకుంది. అక్కడ ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తనతో కలిసి తన గదిలో మద్యం సేవించేందుకు రావాలని ఆ వ్యక్తి కోరడంతో ఆమె అతని వెంట వెళ్లింది. అయితే ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి ఆ మహిళకు విపరీతంగా మద్యం తాగించాడు. అనంతరం ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. అదే స్థితిలో ఉన్న ఆమెను ఫొటోలు తీసి ఎవరికైనా చెబితే ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించాడు. దీంతో అతని దురుద్దేశం అర్థమైన ఆమె అక్కడి నుంచి ఎలాగో తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి అతన్ని రిమాండ్ కు తరలించారు. సదరు వ్యక్తి ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని, అతనిది ఉత్తరప్రదేశ్ అని పోలీసులు తెలిపారు.