శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన ఓ వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఘట్కేసర్కు చెందిన గోస శ్యామ్ రాజ్ (32) హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఆగి ఉన్న గోస జ్యామ్ రాజ్‌ను అటుగా వేగంగా వచ్చిన బెంజ్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్యామ్ రాజ్‌కు తీవ్ర గాయాలవ్వగా అతన్ని చికిత్స నిమిత్తం మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న అతను సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా యాక్సిడెంట్‌కు కారణమైన బెంజ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా, యాక్సిడెంట్ అయిన వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.






