శేరిలింగంపల్లి, ఏప్రిల్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో ఉన్న SC బస్తీ శ్మశాన వాటిక దారిని ఓ బిల్డర్ కబ్జా చేశాడని, శ్మశాన వాటికకు దారి ఇప్పించాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని నల్లగండ్ల SC బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా నల్లగండ్ల బస్తీ వాసులు మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా శ్మశానంకు వెళ్లే దారిని ఈ మధ్య ఓ బిల్డర్ కబ్జా చేసి శ్మశానంకు దారి ఇవ్వడం లేదన్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి వీలు లేకుండా దారిని కబ్జా చేయడమే కాక గేట్ లకు తాళం వేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని గాంధీని కోరారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ SC బస్తీ శ్మశాన వాటిక దారిని కబ్జాకు పాల్పడిన బిల్డర్ ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని, దారిని పునరుద్దరిస్తామని తెలిపారు. శ్మశాన వాటికకు వెళ్లకుండా దారిని కబ్జా చేయడం సమంజసం కాదని, త్వరలోనే అక్కడ అధికారులతో పర్యటించి దారిని పునరుద్ధరించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల SC బస్తీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





