శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): కౌశిక్ మారిడి అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌కు చెందిన ఒరిజినల్ ఆటోమొబైల్ వీడియోలను అనుమతి లేకుండా డౌన్‌లోడ్ చేసి, నకిలీ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్ చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. కౌశిక్ మారిడి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆటోమొబైల్‌కు సంబంధించిన వీడియోలను ప్రచురిస్తుంటారు. అయితే, గుర్తుతెలియని వ్యక్తి సెప్టెంబర్ 27న Kowshik Automobile పేరుతో నకిలీ ఫేస్‌బుక్ పేజీని సృష్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ పేజీలో కౌశిక్ మారిడికి చెందిన ఒరిజినల్ వీడియోలను ఆయన అనుమతి లేకుండా డౌన్‌లోడ్ చేసి తిరిగి అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 11 నాటికి ఆ నకిలీ పేజీలో మొత్తం 17 వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు ఫిర్యాదుదారుడు వెల్లడించారు. ఈ విషయంపై మెటా సంస్థకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, సంబంధిత పేజీ తొలగించలేదని పేర్కొన్నారు. నకిలీ పేజీ కారణంగా తన బ్రాండ్ పేరుపై ప్రజల్లో గందరగోళం ఏర్పడడంతోపాటు, అధికారిక ఫేస్‌బుక్ పేజీని ప్రారంభించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదుదారుడు తెలిపారు. తన వీడియోలను అనధికారికంగా ఉపయోగిస్తూ నకిలీ పేజీని నిర్వహిస్తున్న గుర్తుతెలియని వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





