శేరిలింగంపల్లిలో మేధావుల సదస్సు విజయవంతం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ భద్రత, ఆర్థిక పారదర్శకత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులతో నిర్వహించిన ప్రత్యేక మేధోమథన సదస్సు విజయవంతమైంది. కొండాపూర్‌లోని సీసీఆర్‌టీ (CCRT) ప్రాంగణంలో నిర్వహించిన ఈ సదస్సులో చేవెళ్ల ఎంపీ డాక్టర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ (SIR), విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనలు, దేశ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో వాస్తవాలను ఆధారాలతో సహా వివరించడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ భద్రత, ఆర్థిక పారదర్శకత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఎఫ్‌సీఆర్‌ఏ అమలు ద్వారా విదేశాల నుంచి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. కొన్ని ఎన్జీవోల ముసుగులో దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా విదేశీ నిధులను మళ్లిస్తే, చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం సహజమని అన్నారు. అలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాస్పదం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కాంగ్రెస్ వైఖరిని విద్యావంతులు, మేధావులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి, దేశ సమగ్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. దేశ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా మద్దతు పలుకుతూ, రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరుపై అనుమానాలు రేకెత్తించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న నిబంధనలు దేశ సమగ్రత, జాతీయ భద్రతను కాపాడటానికేనని వివరించారు. ఐటీ, సాంకేతిక, విద్యా రంగాలకు కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లిలోని మేధావులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. సదస్సు ముగింపులో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీ నిపుణులు, న్యాయవాదులు, పరిశోధకులు, విశ్రాంత అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ గణాంకాలు, వాస్తవ ఆధారాలతో సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ ముఖ్య నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here