ప్రశాంత్ నగర్ వాసులకు అండగా ఉంటా: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్వే నంబర్ 100 భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రశాంత్ నగర్ కాలనీ వాసులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఈ మేరకు కాలనీకి చెందిన పలువురు నివాసితులు PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. తాము ఎన్నో ఏళ్లుగా ప్రశాంత్ నగర్ కాలనీలో నివసిస్తున్నామని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమ భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని తెలిపారు. ప్రభుత్వ రికార్డులు, అధికారిక అనుమతులను నమ్మి జీవితకాల కష్టార్జితంతో ప్లాట్లు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. తమ సమస్యను మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని గాంధీని కోరారు.

1954 నుంచి 1979 మధ్య రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులు, అవకతవకలకు బాధ్యులెవరని కాలనీ వాసులు ప్రశ్నించారు. ఒకవైపు రెవెన్యూ శాఖ భూముల క్రయవిక్రయాలకు రిజిస్ట్రేషన్లు అనుమతించగా, మరోవైపు అప్పటి ప్రభుత్వ సంస్థ HUDA లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ శాఖలు ఇచ్చిన అనుమతులను విశ్వసించి 1993 ప్రాంతంలో ఎంతోమంది ప్లాట్లు కొనుగోలు చేశారని వివరించారు. వారిలో సింగరేణి, హెచ్‌ఎంటీ, ఆల్విన్, హెచ్‌ఏఎల్, ఐడీపీఎల్, బీడీఎల్ తదితర సంస్థల్లో పనిచేసిన కార్మికులు, చిన్న ఉద్యోగులు, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు అధికంగా ఉన్నారని తెలిపారు. జీవితాంతం సంపాదించిన డబ్బును, పదవీ విరమణ ప్రయోజనాలను వెచ్చించి సొంతింటి కలతో ప్లాట్లు కొనుగోలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ రికార్డులను, అధికారిక అనుమతులను నమ్మి భూములు కొనుగోలు చేయడం తమ తప్పా? ప్రభుత్వ శాఖల్లో జరిగిన తప్పిదాలకు సామాన్య ప్రజలు మూల్యం చెల్లించాలా? దశాబ్దాల తర్వాత భూముల యాజమాన్యంపై వివాదం తలెత్తితే తమ జీవితకాల పొదుపు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూనే, నిజమైన కొనుగోలుదారుల ప్రయోజనాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, అప్పటి రెవెన్యూ రికార్డుల మార్పులు, లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లలో జరిగిన లోపాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. నిజమైన కొనుగోలుదారులను గుర్తించి, చట్టపరంగా సాధ్యమైన పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాలు లేదా ఇతర న్యాయమైన పునరావాస మార్గాలను పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ వ్యవస్థను నమ్మి తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టిన అమాయక కుటుంబాలకు కూడా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

కాలనీ వాసుల సమస్యలను సావధానంగా విన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అదే సమయంలో అమాయక కుటుంబాలకు న్యాయం జరిగేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశాంత్ నగర్ కాలనీ వాసుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కాలనీ వాసులు ఎవరూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆరెకపూడి గాంధీ భరోసా ఇచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here