మాదాపూర్ డివిజన్‌లో రూ.9.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.9 కోట్ల 14 లక్షల 35 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. అరుణోదయ కాలనీ, అయ్యప్ప సొసైటీ, గోకుల్ ప్లాట్స్, ఆదిత్య నగర్, మాతృశ్రీ నగర్, సిద్ధి వినాయక నగర్, గుట్టల బేగంపేట్, సర్వే ఆఫ్ ఇండియా, సైబర్ హిల్స్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, వరద నీటి కాల్వల నిర్మాణం, గుట్టల బేగంపేట్ శ్మశాన వాటిక అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లు, వరద నీటి కాల్వల నిర్మాణ పనులు ప్రారంభం కావడం వల్ల ఆయా కాలనీల ప్రజలకు ఇబ్బందులు తొలగనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా వరద నీటి కాల్వల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

గుట్టల బేగంపేట్ శ్మశాన వాటికను రూ.2 కోట్లతో అన్ని హంగులతో అభివృద్ధి చేసి సుందరీకరించనున్నట్లు గాంధీ తెలిపారు. ఇందులో భాగంగా ప్రహరీ గోడ, దహన వాటిక, స్నానపు గదులు, శివుడి విగ్రహం, పూజా మండపం, స్టోర్ రూములు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, వర్షపు నీటి ఇంకుడు గుంత నిర్మించనున్నట్లు వివరించారు. ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఈ అభివృద్ధి పనులతో కాలనీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here