వ్యభిచార గృహంపై దాడులు.. ఐదు మంది విదేశీయుల అరెస్టు..

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పరిధిలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదు మంది విదేశీయులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శివప్రసాద్ తెలిపిన ప్రకారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరి ధిలోని న్యూ హఫీజ్ పేట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ క్ర‌మంలో విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశంలోని మొన్రోవియాకి చెందిన డేరియస్ (28) 2021 సంవత్సరంలో విద్యాభ్యాసం నిమిత్తం భారతదేశానికి వచ్చి సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతనితోపాటు కెన్యా దేశానికి చెందిన ఇద్ద‌రు మహిళలు ఉగాండా దేశానికి చెందిన ఇద్ద‌రు మహిళలతో కలిసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. డేరియస్ తోపాటు నలుగురు విదేశీ మహిళలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుండి 4 వేల రూపాయల నగదు, సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోం కు తరలించగా డేరియస్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వెంట ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here