శేరిలింగంపల్లి, అక్టోబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవాలను దానం చేసిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ ఐ ఆంజనేయులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ నగర్ కు చెందిన సామల పాపిరెడ్డి (46) బీ ఏచ్ ఈ ఎల్ కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య సామల లత, కుమారుడు నీరజ్ రెడ్డి, కుమార్తె కీర్తన లు ఉన్నారు. ఈ నెల 25వ తేది శనివారం జేపీ నగర్ నుంచి సాధన స్కూల్ మీదుగా BHEL కంపెనీ కి హోండా యాక్టివా (TS 15 EU 1346) పై వెళ్తున్న సమయంలో స్కూల్ ముందు రాగానే నల్లగండ్ల నుంచి టీవీఎస్ అపాచే బైక్ (TN 07 BH 5172) పై వచ్చిన వ్యక్తి పాపిరెడ్డి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో హోండా యాక్టివా పై ఉన్న పాపి రెడ్డి ఎగిరి కింద పడడంతో తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే స్థానికులు దగ్గరలో ఉన్న సిటిజెన్ హాస్పిటల్ కు తరలించారు. కాగా అతను 2 రోజులుగా చికిత్స పొందుతుండగా సోమవారం రాత్రి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా రోడ్డు ప్రమాదంలో గాయాలై బ్రెయిన్ డెడ్ అయిన పాపి రెడ్డి అవయవాలను దానం చేయాలని అతని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడంతో వైద్యులకు తెలియజేశారు. దీంతో వైద్యులు అతని అవయవాలను దానం చేశారు.






