శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): బంగారం దొంగిలించాలనే ఉద్దేశంతో ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన యువతికి కోర్టు జీవిత ఖైదు విధించింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ 2లో ప్లాట్ నంబర్ 95లో నివాసం ఉంటున్న మనెమ్ శ్రీనివాస్, సునీతలు దంపతులు. వీరు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరి కుమారుడు సుమంత్‌ను సెప్టెంబర్ 9వ తేదీన ఉదయం స్కూల్‌లో విడిచిపెట్టి తమ ఆపీస్‌లకి ఉద్యోగం నిమిత్తం వెళ్లిపోయారు. కాగా ఇంట్లో శ్రీనివాస్ తలల్లి పడాల ఉమాదేవి (69) ఒక్కతే ఉంది. ఆ సమయంలో ప్లాట్ నంబర్ 96లో పని మనిషిగా పనిచేస్తున్న వసుంధర అలియాస్ వసుంధర లక్ష్మి అలియాస్ వసుధ (20) శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లింది.
ఉమాదేవి ఒంటిపై ఉన్న బంగారాన్ని దొంగిలించేందుకు గాను ఆమెపై కత్తితో దారుణంగా దాడి చేసి పొడిచింది. దీంతో ఉమాదేవి బిగ్గరగా కేకలు వేయగా చుట్టు పక్కల వారు శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఇంటికి వచ్చి చూడగా తన తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. ఉమాదేవిని పొడిచిన వసుంధర అక్కడే ఉండడంతో ఆమె భయంతో తనకు తాను గాయాలు చేసుకుంది. దీంతో ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న సిటిజన్ హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వసుంధరను అరెస్టు చేసి కూకట్‌పల్లిలోని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి సి.పావని ఆమెకు జీవిత ఖైదు విధించారు. రూ.3000 జరిమానా చెల్లించాలని కూడా తీర్పు ఇచ్చారు. కాగా వసుంధర వృద్ధురాలి నుంచి చంద్రహారం, చెయిన్, 6 బంగారు గాజులు మొత్తం రూ.1 లక్ష విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించగా పోలీసులు రికవరీ చేశారు.