ఎక్కువ లాభాలు వ‌స్తున్నాయ‌నే అసూయ‌తో తోటి వ్యాపారిని దారుణంగా హ‌త్య చేసిన వ్య‌క్తి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వ్యాపారంలో త‌న‌క‌న్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాడ‌నే కార‌ణంతో ఓ షాపు య‌జ‌మానిని ఓ వ్య‌క్తి అతి కిరాత‌కంగా హ‌త్య చేశాడు. మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి మాదాపూర్ జోన్ డీసీపీ తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని హ‌ఫీజ్‌పేట రైల్వే స్టేష‌న్ స‌మీపంలో శ్రీ‌నివాసులు అలియాస్ శ్రీ‌ను అనే వ్య‌క్తి గ‌త 5 సంవ‌త్స‌రాలుగా ఫైర్‌వుడ్ వ్యాపారం చేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అత‌నికి వ్యాపారంలో లాభాలు కూడా వ‌స్తున్నాయి. కాగా అత‌ని ప‌క్క షాపు య‌జ‌మాని అయిన ఎస్‌కే మొయిజ్ అనే వ్య‌క్తికి శ్రీ‌నివాసులు చేస్తున్న వ్యాపారంపై క‌న్ను కుట్టింది. అత‌నికి పెద్ద మొత్తంలో లాభాలు వ‌స్తుండ‌డాన్ని చూసి మొయిజ్ ఓర్వ‌లేక‌పోయాడు. ఎలాగైనా అత‌ని షాపును స్వాధీనం చేసుకోవాల‌ని ప‌థ‌కం పన్నాడు. అందులో భాగంగానే ఆగ‌స్టు 10వ తేదీన మ‌ధ్యాహ్నం 1.30 నుంచి 2 గంట‌ల స‌మ‌యంలో శ్రీ‌నివాసుల‌తో మొయిజ్ కార‌ణం లేకుండా గొడ‌వ‌కు దిగాడు. ఇదే అద‌నుగా భావించిన మొయిజ్ శ్రీ‌నివాసులును హ‌త్య చేయాల‌ని భావించాడు. అందుకు గాను త‌న మేన‌ల్లుడు సాహిల్‌, త‌న షాపులో ప‌నిచేస్తున్న వ‌ర్క‌ర్ మ‌క్బుల్‌, ఆటో డ్రైవ‌ర్ అన్వ‌ర్ ల స‌హాయం తీసుకున్నాడు. వారు కూడా గొడ‌వ జ‌రుగుతున్న చోటుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో సాహిల్ శ్రీ‌నివాసులును పొట్ట‌లో క‌త్తితో బ‌లంగా పొడిచాడు. అదే క్ర‌మంలో మొయిజ్ కూడా మ‌క్బుల్‌, అన్వ‌ర్‌ల స‌హాయంతో శ్రీ‌నివాసులు గొంతు నులిమాడు. దీంతో శ్రీ‌నివాసులు తీవ్ర గాయాల పాల‌వ్వ‌గా అత‌న్ని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కాగా అప్ప‌టికే అత‌ను మృతి చెందాడ‌ని వైద్యులు నిర్దారించారు. దీంతో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here