- 18 ఏళ్ళు పై బడినవారందరికీ టీకా
- కోవిన్, ఆరోగ్యసేతు యాప్ లలో రిజిస్ట్రేషన్
- తెలంగాణలో ప్రజల వద్దకే వాక్సిన్.. సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం
నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ మరో అడుగు ముందుకు పడబోతోంది. మూడవ దశలో భాగంగా మే 1 నుండి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభం కానుంది. వాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ప్రారంభమయ్యింది. ఆరోగ్యసేతు, కోవిన్ యాప్ ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వాల ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం అందించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా వాక్సిన్ అందించనుండగా ప్రైవేట్ ఆసుపత్రులలో చెల్లించాల్సిన రుసుముపై స్పష్టత రాలేదు.
ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి…
ఇప్పటివరకు వాక్సినేషన్ కేంద్రాలలో 45 సంవత్సరాలు నిండినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తో పాటుగా నేరుగా వెళ్లి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు చూపించి వాక్సిన్ వేయించుకోగా 45 సంవత్సరాల లోపు ఉన్నవారు వాక్సిన్ వేయించుకునేందుకు కోవిన్, ఆరోగ్యసేతు యాప్ లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కొవిన్ పోర్టల్ https://www.cowin.gov.in/home మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్’ పేజి తెరచుకుంటుంది. అందులో మీ గుర్తింపు కార్డు(ఆధార్ లేదా పాన్ లేదా ఓటరు కార్డు) వివరాలు, పేరు, పుట్టిన సంవత్సరం తదితర వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత టీకా వేయించుకునే తేదీని ఎంచుకోవాలి. పిన్‌కోడ్ ఎంటర్ చేయడం లేదా, జిల్లాను ఎంచుకోవడం ద్వారా మనకు సమీపంలోని టీకా కేంద్రాల జాబితా కనబడుతుంది. మీకు అనుకూలంగా ఉన్న కేంద్రాన్ని ఎంచుకుని ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకొని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒక్కసారి లాగిన్ అయ్యి నలుగురి వాక్సినేషన్ కోసం షెడ్యూలు చేసుకోవచ్చు.మనం ఎంచుకున్న తేదీలలో వీలుకాకుంటే తేదీలను మార్చుకొనే వెసులుబాటు కూడా ఉంది. దీంతోలాటు ఆరోగ్య సేతు యాప్‌లో సైతం కోవిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పైన తెలిపిన విధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది.
తెలంగాణలో ప్రజలవద్దకే…
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ వాక్సినేషన్ కేంద్రాలలో టీకా ప్రక్రియ కొనసాగుతుండగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజల వద్దకు టీకా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మే 1 నుండి టీకా కేంద్రాలవద్ద రద్దీ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పల్స్ పొలియో తరహాలో కాలనీ కమ్యూనిటీ హాళ్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అపార్టుమెంట్లు తదితర ప్రాంతాల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు నెలల్లో వాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆశా వర్కర్లు, నర్సులు, ఏఎన్ ఎంలను వాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయనున్నట్లు సమాచారం.