కొండాపూర్ డివిజన్లలో కార్పొరేటర్ హామీద్ పటేల్ క్షేత్రస్థాయి పర్యటన
కొండాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ హామీద్ పటేల్ శనివారం ఉన్నతాధికారులతో కలసి క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ రాజశేఖర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, స్థానిక నాయకులతో కలసి బస్తీలో పర్యటించిన ఆయన డ్రైనేజీ సమస్యపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడ, రాఘవేంద్ర కాలనీల నుండి మార్తాండ్ నగర్ మీదుగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అవుట్ లెట్ ను మార్తాండ్ నగర్ గణేష్ దేవాలయం పక్క నున్న పెద్ద నాలాలోకి కలపటం జరిగిందని తెలిపారు. దీని వల్ల కురుస్తున్న వర్షాల కారణంగా పైనుండి దిగువకు వర్షపు నీరు పెద్ద నాలలోకి చేరటంతో, డ్రైనేజీ వరద నీరు పోవటానికి ఇబ్బందులు తలెత్తి మురుగు నీరు వెనుకకు రావటంతో, మురుగు నీరు రోడ్లపైకి, లోతట్టులో ఉన్న ఇళ్లలోకి చేరుతుందని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించే దిశగా మార్తాండ్ నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, వర్షపు నీరు సాఫీగా వెళ్ళటానికి స్ట్రామ్ వాటర్ డ్రైన్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. అలాగే పెద్ద నాలా ఎత్తును పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో వర్క్ ఇన్స్పెక్టర్ కిష్టప్ప, వార్డు మెంబర్ పి. శ్రీనివాస్ చౌదరి, ఏరియా కమిటీ మెంబర్ తాడెం మహేందర్, సత్యనారాయణ, మహ్మద్ పాషా, జహంగీర్, బాబా, త్రిమూర్తులు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.