ఒకే కాలనీలో రెండు సంక్షేమ సంఘాలు…పోటాపోటీగా కాలనీ అభివృద్ది పనులు
చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): సాధారణంగా ఏ కాలనీలోనైనా అక్కడ నివసించే ప్రజలంతా కలిసి తమ బాగోగులు చూసుకునేందుకు ఒక సంక్షేమ సంఘాన్ని నియమించుకుంటారు. సంఘం ప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో స్థానిక ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం మనం చూస్తూ ఉంటాం. అయితే చందానగర్ డివిజన్ లోని అన్నపూర్ణ కాలనీలో మాత్రం రెండు కాలనీ సంక్షేమ సంఘాలు ఉండటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. రెండు సంఘాల నాయకులు పోటీపడి ప్రజాప్రతినిధులకు కాలనీ సమస్యలు వివరిస్తూ పనులు చేయించడం మరో విశేషం. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లో కొన్ని సంవత్సరాలుగా అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరిట కాలనీ సంక్షేమ సంఘం ఉంది. ఇటీవల పాత కమిటీ పదవీ కాలం పూర్తవ్వగా కొంతమంది సభ్యులతో కొత్త కమిటీని నియమించారు. ఇదిలా ఉండగా కొంతమంది వ్యక్తులు తాజాగా అన్నపూర్ణ ఎన్‌క్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ పేరిట మరొక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రిజిష్టర్ చేయించారు. అంతటితో ఆగకుండా రెండు సంఘాల నాయకులు పోటాపోటీగా కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిలకు కాలనీ సమస్యలు వివరిస్తూ పనులు జరిగేలా చూస్తున్నారు. రెండు సంఘాల నాయకులకూ ప్రజాప్రతినిధులు సమ ప్రాధాన్యతనివ్వడం గమనార్హం.

ఎక్కడైనా కాలనీ సంక్షేమ సంఘాలుగా ఏర్పడే నాయకుల మధ్య పోటీ ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించి ఎక్కువ మంది కాలనీవాసుల మద్దతు కూడగట్టిన వారిని ఎన్నుకోవడం ఆనవాయితీ. అయితే అన్నపూర్ణ కాలనీలో అందుకు భిన్నంగా ఎవరికివారు సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం రెండు వర్గాల మధ్య గల అభిప్రాయ బేధాలకు నిదర్శనంగా మారుతోంది. రెండు సంఘాల నాయకులు పోటీపడి కాలనీ సమస్యలపై చిత్తశుద్దితో పనిచేస్తున్నందుకు ఓ వైపు కాలనీ వాసులు సంతోషంగా ఉన్నప్పటికీ మరోవైపు అయోమయానికి గురవుతున్నారు. తమకు ఏదైనా సమస్య వస్తే ఎవరిని ఆశ్రయించాలో, భవిష్యత్‌లో ఏ అసోసియేషన్ సభ్యులకు మద్దతు తెలపాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒరలో రెండు కత్తులు అన్న చందంగా కాలనీ పరిస్థితి అయ్యిందని కాలనీవాసులు వాపోతున్నారు. కాలనీలో రెండు అసోసియేషన్‌లు ఏర్పడటానికి గల సరైన కారణాలు తెలియనప్పటికీ భవిష్యత్‌లో ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.