నమస్తే శేరిలింగంపల్లి : 520 వ అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా అన్నమాచార్య భావనా వాహినిలో 3 వ రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం అన్నమాచార్య భావనా వాహిని శిష్యబృందంచే “సంకీర్తనా సుమం” పేరుతో అన్నమాచార్య సంకీర్తనా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. తోలుతగా చిరంజీవి నారాయణి “శ్రీ నందకాయ విద్మహే” అన్నమ గాయత్రి మంత్రం తో ప్రారంభించింది. తరువాత చిరంజీవి ఆశ్రిత “తగున్నయా హరి నీకు’, కుమారి సాహితీ “వాడల వాడల వెంట వాడెవో వాడెవో”, రన్వీతా, చైత్ర, అఖిల్, మార్తి విజయ లక్ష్మి, శశి కళా, మానసా, అభిరామ్, మానస పటేల్ కలసి తాళ్ళపాక అన్నమాచార్య, ఈ రూపమై ఉన్నాడు, వందేహం గురుదేవం, తగునయ్య హరి, వాడల వాడల వెంట, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, ఆది పురుషా, సిరుత నవ్వుల వాడే సిన్నెక, ఇంత చక్కని పెండ్లి కొడుకు మొదలగు సంకీర్తనలు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. పద్మశ్రీ డా. శోభారాజు కార్యక్రమం ఉద్దేశించి “వాడల వాడల వెంట” అనే కీర్తన వివరిస్తూ “అన్నమాచార్య భగవంతుని వివిధ గుణాలను విశేష చీరలుగా వాడ వాడ తిరిగి నేత బేహారిగా వర్ణించారు” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి వాయిద్య సహకారం కీబోర్డ్ రాజేశ్వరరావు గారు, తబలా బీ. వీ. రమణమూర్తి అందించారు. అనంతరం హారతి, తీర్థ ప్రసాదాల వితరణ తో కార్యక్రమం ముగిసింది.