సూరత్‌కు చెందిన ఓ రెండున్నరేళ్ల బాలుడు మరణిస్తూ ఐదుగురికి ప్రాణదానం చేశాడు. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురైన బాలుడి అవయవాలను అతని తల్లిదండ్రులు దానం చేశారు. దీంతో ఆ బాలుడు అత్యంత పిన్న వయస్సు కలిగిన అవయవ దాతగా గుర్తింపు పొందాడు. వివరాల్లోకి వెళితే…
డిసెంబర్ 9వ తేదీన సూరత్‌లోని భటర్ ఏరియాలో శాంతి ప్యాలెస్ అనే ఓ అపార్ట్‌మెంట్ రెండో అంతస్థు నుంచి జాష్ ఓజా అనే రెండున్నర ఏళ్ల బాలుడు అనుకోకుండా దురదృష్టవశాత్తూ కింద పడిపోయాడు. దీంతో వైద్యులు అతనికి హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స అందించారు. అయితే అతని మెదడులో రక్తం గడ్డకట్టి వాపునకు గురైందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 14న అతను బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కాగా డొనేట్ లైఫ్ అనే సంస్థకు చెందిన ప్రతినిధులు ఆ విషయం తెలుసుకుని జాష్ తల్లిదండ్రులు సంజీవ్, అర్చనలతో మాట్లాడారు. ఈ క్రమంలో వారు జాష్ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. దీంతో జాష్ ఊపిరితిత్తులను విమానంలో కేవలం 160 నిమిషాల్లోనే చెన్నైకి తరలించారు. గుండెను రష్యాకు చెందిన నాలుగేళ్ల బాలుడికి అమర్చగా, ఊపిరితిత్తులను ఉక్రెయిన్‌కు చెందిన మరో నాలుగేళ్ల చిన్నారికి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో అమర్చారు.
అలాగే జాష్ కిడ్నీలను స్పెషల్ గ్రీన్ కారిడార్ ద్వారా 180 నిమిషాల్లో 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు. ఒ కిడ్నీని 13 ఏళ్ల బాలికకు, ఇంకో కిడ్నీని 17 ఏళ్ల బాలికకు అమర్చారు. అలాగే జాష్ లివర్ ను మరో 2 ఏళ్ల చిన్నారికి అమర్చారు. ఇలా ఆ బాలుడు మరణించినా ఐదుగురికి పునర్జన్మ ఇచ్చాడు.