మనస్థాపంతో సివిల్ ఇంజనీర్ ఆత్మహత్య

  • బిల్డ‌ర్ భానుప్ర‌సాద్ వేదింపులే త‌న చావుకు కార‌ణ‌మంటూ సూసైడ్ నోట్‌

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): తనపై చీటింగ్ కేసు నమోదవ్వ‌డంతో పాటు, య‌జమాని వేధింపులు తాళ‌లేక‌ మనస్తాపం చెందిన ఓ యువ ఇంజనీరు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, గిద్దలూరు ప్రాంతానికి చెందిన రాసంరెడ్డి నాగిరెడ్డి కుటుంబం రెండున్నర దశాబ్దాల క్రితం నగరానికి వలస వచ్చింది. ప్రస్థుతం చందానగర్ జవహర్ కాలనీలో నివాసముంటుంది. నాగిరెడ్డి కుమారుడు రాసంరెడ్డి జితేందర్ రెడ్డి (29) గత రెండేళ్లుగా సోమాజిగూడలోని భాను ప్రసాద్ అనే బిల్డర్ వద్ద ఇంజనీరుగా పని చేస్తున్నాడు. కాగా నెల రోజుల క్రితం తన ఆరు లక్షల రూపాయల నగదును అనుమతి లేకుండా జితెందర్ వాడుకున్నాడు అంటూ భానుప్రసాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు.

రాసంరెడ్డి జితేంద‌ర్‌రెడ్డి(ఫైల్‌)

ఈ కేసు విషయంలో రిమాండుకు వెళ్లి కండిషన్ బెయిల్ పై జితేందర్ రెడ్డి బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వచ్చాడు. తాను నివాసముండే ఇంట్లో ఫ్యాన్ హుక్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయేముందు జితేందర్ రెడ్డి పాకెట్ బుక్ లో రాసిన సూసైడ్ నోట్ లో తన చావుకు భాను ప్రసాద్ కారణమని, ఆయన వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. తనకు ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేస్తానని, తన జీవితాన్ని నాశనం చేస్తానని, భాను ప్రసాద్ వేధింపులకు గురి చేసిన కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సూసైడ్ నోట్లో రాశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

జితేంద‌ర్ రెడ్డి రాసిన సూసైడ్ నోట్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here