కూకట్‌పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ లో ఉన్న శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్ యాజమాన్యం అక్రమంగా తమ భవన నిర్మాణాన్ని విస్తరించిందని ఆరోపిస్తూ పలువురు కాలనీల వాసులు సోమవారం ఉపకమిషనర్ వి.ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ హాస్పిటల్ భవనాన్ని అక్రమంగా విస్తరించిన హాలిస్టిక్ హాస్పిటల్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. భవనం విస్తరణ వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఫిర్యాదుదారులకు మద్దతు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం డీసీతో మాట్లాడారు. అనుమతులు లేకుండా విస్తరణ చేపడుతున్న నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే బాధితులతో కలిసి పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.