మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గుట్టు చప్పుడు కాకుండా ఓ ప్రైవేటు బస్సులో గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన వేదులపల్లి సూరిబాబు (38) బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. సికింద్రాబాద్లోని నాలుగుకాళ్ల మండపం వద్ద కార్మికుడిగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా ఉత్తరప్రదేశ్లోని షిరాత్ జిల్లా ఫైన్సా మండలం జాహిద్పూర్ గ్రామానికి చెందిన బబ్లు కుమార్ (22)కు 5 రోజుల కిందట సూరిబాబుతో పరిచయం అయింది. దీంతో వీరు సులభంగా డబ్బులు సంపాదించేందుకు గాను గంజాయి అమ్మాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగానే సూరిబాబు, బబ్లు కుమార్ ఇద్దరూ ఖమ్మం వెళ్లి అక్కడ 50 కిలోల గంజాయిని సేకరించి హైదరాబాద్కు వచ్చారు. తరువాత ఈ నెల 17వ తేదీన సదరు గంజాయిని ప్యాకెట్లలో మహారాష్ట్రలోని పూణెకు ఓ ప్రైవేటు బస్సులో తరలించాలని చూశారు. కాగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు మియాపూర్లోని కేఎస్ బేకరీ వద్ద కూకట్పల్లి నుంచి వస్తున్న ప్రైవేటు బస్సును ఆపి తనిఖీలు చేపట్టారు. దీంతో పోలీసులకు గంజాయి ఉన్న ప్యాకెట్లు కనిపించాయి. ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టగా సూరిబాబు, బబ్లు కుమార్ ఇద్దరూ ఆ గంజాయిని పూణెకు తరలిస్తున్నట్లు అంగీకరించారు. దీంతో పోలీసులు వారి నుంచి గంజాయి ప్యాకెట్లను, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వారిని కేసు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు.