శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని మాదాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పశువైద్యశాల ప్రహరీ గోడను అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడంపై బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదాపూర్ గ్రామ సర్వే నంబర్ 87లో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ ప్రభుత్వ పశువైద్యశాలను అప్పటి ప్రభుత్వం 1991లో నిర్మించిందని ఆయన తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత స్థలాన్ని విజయ డెయిరీకి కేటాయించినట్లు పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం పశువైద్యశాల వెనుక భాగంలో ఓ భారీ అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతోందని, ఈ నిర్మాణానికి పశువైద్యశాల అడ్డుగా ఉందనే కారణంతోనే కొందరు పెద్దలు, అధికారులు కుమ్మక్కై రోడ్డు పక్కన ఉందనే సాకుతో ప్రహరీ గోడను కూల్చివేశారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని మల్లారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రాథమిక పశువైద్యశాలను తిరిగి పునరుద్ధరించడంతో పాటు, ప్రహరీ గోడను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ ఆస్తులను, ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే వైద్యశాలలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటూ, ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని మిద్దెల మల్లారెడ్డి హెచ్చరించారు.






