శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101లో ఉన్న సుమారు 550 ఎకరాల విలువైన భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డిమాండ్ చేసింది. ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించకుండా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు అవసరాల కోసం వినియోగించాలని కోరింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రవికుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

మియాపూర్‌లోని 550 ఎకరాల భూములు శేరిలింగంపల్లి నియోజకవర్గ భవిష్యత్తుకు ఎంతో కీలకమని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ భూములను ప్రజా ప్రయోజనాలకు కేటాయించాలని సూచించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు, నాణ్యమైన విద్య అందించే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా యువత కోసం క్రీడా మైదానాలు, ప్లేగ్రౌండ్లు, పర్యావరణ పరిరక్షణకు లంగ్ స్పేస్‌లు, భారీ పార్కులు, గ్రీన్ బెల్టులు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ భూముల వ్యవహారం కారణంగా ఇళ్లు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రజలను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుని న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మియాపూర్‌లోని భూములను సందర్శించనున్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటలకు రామచంద్రరావు పర్యటన ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు, స్థానిక ప్రజలు, యువత, విద్యావంతులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రజా ఉద్యమానికి మద్దతు తెలపాలని రవికుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా బీజేపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, పదాధికారులు, పార్టీ కార్యకర్తలందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. మా శేరిలింగంపల్లి భూములు – మా హక్కు – మా ప్రజలకే చెందాలి అనే నినాదంతో 550 ఎకరాల భూములను ప్రజా అవసరాలకే కేటాయించాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.





