హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద ప్రత్యేక పారిశుధ్య తనిఖీలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్‌ను పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) చేపట్టిన 10 రోజుల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా మియాపూర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్‌పేట్ డివిజన్‌లో హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద అధికారులు ప్రత్యేక పారిశుధ్య తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా పోస్టర్ రహిత సైబరాబాద్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించారు. మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ‌నివాస్‌ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, శానిటేషన్ రిసోర్స్ పర్సన్, రాంకీ సంస్థ ప్రతినిధులు కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజా ఆస్తులపై ఏర్పాటు చేసిన అనధికార పోస్టర్లు, గోడ ప్రకటనలు, ఇతర ప్రచార సామగ్రిని గుర్తించారు. వాటిని పూర్తిస్థాయిలో తొలగించి, ప్రభుత్వ ఆస్తులపై అక్రమ ప్రచారాలను అరికట్టాలని అధికారులు దృష్టి సారించారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం కాపాడడంతోపాటు తొలగించిన ప్రదేశాల్లో తిరిగి పోస్టర్లు ఏర్పాటు కాకుండా పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పారిశుధ్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కల్పించడం, నిబంధనలను కఠినంగా అమలు చేయడం ద్వారా సైబరాబాద్‌ను పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన, పోస్టర్ రహిత నగరంగా అభివృద్ధి చేసేందుకు CMC కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here