అన్నమయ్య సంకీర్తనలతో ఏడుకొండల స్వామికి ఏలూరు సాయి గణేష్ బృందం స్వరార్చన

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 31 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో ఈ శనివారం అన్నమయ్యపురంలో నిర్వహించిన వారాంతపు అన్నదానం, అన్నమ స్వరార్చన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ అన్నమాచార్య అష్టోత్తరం, అన్నమ గాయత్రి పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఏలూరుకు చెందిన సాయిగణేష్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ గురువు సాయి గణేష్ చారి సంగీత బృందం తరఫున బి.కె. బిందు అన్నమయ్య సంకీర్తనలను మధురంగా ఆలపించి ఏడుకొండల స్వామికి స్వరార్చన సమర్పించారు. నారాయణ, మత్స్య కూర్మ వరాహ, దీన రక్షకుడా, తిరుమలగిరి రాయ, తగునయ్య హరి నీకు, ఇటువంటివాడవు, కదిరి నృసింహుడు, వెంకటాచల నిలయం, క్షీరాబ్ధి కన్యకకు, చిత్తడి చెమటమిది తదితర సంకీర్తనలతో భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి సాయి గణేష్ చారి కీబోర్డుపై, నాగరాజు మృదంగంపై వాద్య సహకారం అందించారు.

సాయంత్రం 7 గంటలకు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు అన్నమాచార్య సంకీర్తనల్లోని ఒక కీర్తనకు భావార్థ వివరణ అందించారు. అందులోని భక్తి, ఆధ్యాత్మికత, తాత్విక సందేశాలను వివరించి భక్తులకు సంకీర్తనల అంతరార్థాన్ని తెలియజేశారు. అనంతరం శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది. అన్నమయ్య సంకీర్తనలను సంగీతం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో అన్నమాచార్య భావనా వాహిని ఏడాది పొడవునా ఇటువంటి ఆధ్యాత్మిక, సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. రానున్న కార్యక్రమాల్లో భక్తులు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here