శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని ప్రభుత్వ భూములను కబ్జాదారుల పాలుకాకుండా కాపాడి, పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మియాపూర్ సర్వే నంబర్లు 100, 101తో పాటు ఇతర సర్వే నంబర్లలో ఉన్న సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని ఆయన కోరారు. శనివారం సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, టి. రామకృష్ణ, శేరిలింగంపల్లి మండల కార్యదర్శి చందు యాదవ్, వెంకటస్వామి తదితర నాయకులతో కలిసి నారాయణ మియాపూర్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఈ భూములకు సంబంధించి న్యాయస్థానాల్లో అనేక వివాదాలు, చర్చలు జరిగాయని తెలిపారు. 34 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా, ఏ ప్రభుత్వం కూడా ఈ భూములను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించకపోవడం బాధాకరమన్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఈ భూములు ప్రభుత్వానికి చెందినవిగా తీర్పునిచ్చిన నేపథ్యంలో, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పోటీపడి ప్రెస్మీట్లు నిర్వహిస్తూ తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని విమర్శించారు. ప్రభుత్వ భూములను కాపాడటంతోపాటు వాటిని పేదల సంక్షేమానికి వినియోగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మియాపూర్ ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని, మిగిలిన వందలాది ఎకరాల భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించి హక్కు పత్రాలు అందించాలని నారాయణ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలకు గుడిసెలు వేయించి భూ పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, టి. రామకృష్ణ, సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కే. చందు యాదవ్, దళిత కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె. వెంకటస్వామి, ఎస్. కొండలయ్య, జెట్టి శ్రీను, ఎం. వెంకటేష్, కె. ఖాసీం, కె. సుధాకర్, తుపాకుల రాములు, ఎస్. నారాయణ, రఘు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.





