తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులకు ఘన నివాళి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరవీరులకు ఎంసీపీఐ(యు) నాయకులు ఘన నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ వారోత్సవాల ప్రారంభ సభను ఆదివారం మియాపూర్ ఓంకార్ నగర్‌లో ఎంసీపీఐ(యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. డి. రంగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎంసీపీఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కేవలం భూమి, భుక్తి, విముక్తి కోసం మాత్రమే కాకుండా లెవీ గల్లాలకు వ్యతిరేకంగా, మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా, హక్కు పత్రాల కోసం, ఆత్మగౌరవ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం సాగిందన్నారు. ఈ పోరాటంలో సుమారు 4,000 మంది అమరులయ్యారని, 3,000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యం పెరిగిందని పేర్కొన్నారు. నాటి పోరాట ఫలితాలను తెలంగాణ సమాజం నేటికీ భాషా, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాల రూపంలో అనుభవిస్తోందని అనిల్ కుమార్ అన్నారు. అయితే నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు సామాజిక తెలంగాణ కోసం సాధించుకున్న రాష్ట్రంలో 16 ఏళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ అధికారం కోసం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి బీజేపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. వైద్యం, విద్య, కూడు, గూడు ప్రజలకు ఉచితంగా అందేలా పోరాడటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కె. సుకన్య, తాండ్ర కళావతి, కర్ర దానయ్య, డి. రంగస్వామి, జి. శివాని, బి. విమల, జి. లలిత, మియాపూర్ డివిజన్ సభ్యులు బి. అరుణ, ఇషాక్, స్థానిక పార్టీ సభ్యులు అనిత, అన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here