శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉమ్మడి గచ్చిబౌలి డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA), ముఖ్య నాయకులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అధ్యక్షత వహించారు.

సమావేశంలో ప్రధానంగా SIR ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు. SIR ప్రక్రియలో ఓట్లు కోల్పోయిన వారికి అండగా నిలవాలని, నోటీసులు అందుకున్న వారికి ప్రక్రియపై సరైన అవగాహన కల్పించాలని సాయిబాబా నాయకులకు సూచించారు. అవసరమైన గుర్తింపు పత్రాలతో సంబంధిత BLOలు, అధికారులను సంప్రదించేలా ప్రజలకు సహకరించాలని, ఎవరి ఓటు హక్కు కోల్పోకుండా నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.
ఓటు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్న నాయకులు.. అవగాహన లేని ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించి, వారి ఓటు హక్కు పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ SIR ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని సూచించారు.





