శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ కొండాపూర్ శ్రీరాంనగర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బలరాం యాదవ్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం యాదవ్ మాట్లాడుతూ.. మట్టి వినాయకుడిని నిష్ఠగా తొమ్మిది రోజుల పాటు పూజించి గంగాజలంలో నిమజ్జనం చేయడం మన ఆచారమని తెలిపారు. అయితే ప్రస్తుతం చాలా మంది మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం మానేశారని అన్నారు. పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా ఎకో ఫ్రెండ్లీ గణేష్’ పేరుతో చిన్నారులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణహిత వినాయక చవితిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు బలరాం యాదవ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.






