శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ, లింక్ రోడ్ల నిర్మాణం తదితర అంశాలపై మాదాపూర్‌లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయంలో PAC చైర్మన్ అరెకపూడి గాంధీ కమిషనర్ సృజనతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధి, లింక్ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచనలు ఇవ్వాలని కమిషనర్‌ను కోరారు.

కూకట్పల్లి వై జంక్షన్ వద్ద నిర్మించనున్న HICTI ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని, ఈ ప్రాజెక్టు కోసం భూములు, భవనాలు కోల్పోతున్న వారిని స్వచ్ఛందంగా సహకరించేలా ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిపారు. బాధితులందరికీ టీడీఆర్ (TDR) సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, టీడీఆర్ ప్రక్రియను వేగవంతం చేసి వారికి న్యాయం చేయాలని కమిషనర్‌ను కోరారు. ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి ప్రజలకు సిగ్నల్-రహిత ప్రయాణ సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. మసీదుబండ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని, ఆ పనుల్లో స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి సముచిత న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అంజయ్యనగర్ రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసి, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
గంగారం చెరువు నుంచి జాతీయ రహదారి-65లోని అపర్ణ హిల్ పార్క్ వరకు ప్రతిపాదించిన లింక్ రోడ్డు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులను ఆదేశించాలని కమిషనర్‌ను కోరారు. ఈ లింక్ రోడ్డు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ఇంధన ఆదా కూడా జరుగుతుందని వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను పూర్తి చేయడం, చెరువుల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ శాఖల మధ్య సమన్వయంతో పనిచేసేలా అధికారులకు దిశానిర్దేశం చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో ప్రస్తావించిన అన్ని అంశాలపై కమిషనర్ సృజన సానుకూలంగా స్పందించినట్లు అరెకపూడి గాంధీ తెలిపారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సీసీపీ వెంకన్న, సీఎంసీ చీఫ్ ఇంజినీర్ లక్ష్మి, నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





