శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ సృజన, డిప్యూటీ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు కుత్బుల్లాపూర్ జోన్‌లోని దుండిగల్ సర్కిల్ పరిధి దుండిగల్ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు, కాలనీ ప్రతినిధులతో సమావేశమై పౌర సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా కేవీఆర్ కాలనీ, నాగ్లూర్, దుండిగల్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఇంటి నంబర్ల జారీ, ఆస్తి పన్ను తగ్గింపుపై వచ్చిన వినతులు, ఐఏఆర్ఈ కళాశాల నుంచి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు వీధి దీపాల ఏర్పాటు, శంబీపూర్ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఖాళీ స్థలాల్లో చిన్నారుల ఆట పరికరాల ఏర్పాటు, ఎస్సీ బస్తీలో సీసీ రోడ్లపై ఆక్రమణల తొలగింపు, గగిలాపూర్ శ్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మాణం వంటి అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్థానికులు ప్రస్తావించిన సమస్యలను పరిశీలించిన కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి వార్డులో ఇలాంటి సమీక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.





