శేరిలింంగపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింంగపల్లి): మియాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు సహా ప్రతి ఒక్కరికీ పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న మియాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయం నిర్మాణం సహా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సభ విజయవంతం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల సహకారం, ఆశీర్వాదాలతో తాను వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఆ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని గాంధీ తెలిపారు. సమగ్ర, సంతులిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.





