శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): దేశీయ వైద్య సాంకేతికతకు మరో కీలక మైలురాయి చేరింది. భారతీయ ఆర్థోపెడిక్ నిపుణులు రూపకల్పన చేసి, సిరోనిక్స్ సంస్థ దేశంలోనే తయారు చేసిన హై టిబియల్ ఆస్టియోటమీ (HTO) ఇంప్లాంట్ ను మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఆవిష్కరించారు. దిగుమతి ఇంప్లాంట్లకు ప్రత్యామ్నాయంగా రూపొందిన ఈ సాంకేతికతతో 28 ఏళ్ల యువ వైద్యుడికి విజయవంతంగా జాయింట్ ప్రిజర్వేషన్ శస్త్రచికిత్స నిర్వహించారు. మోకాలి కార్టిలేజ్ తీవ్రంగా దెబ్బతినడం, మోకాలి అమరికలో లోపం (Malalignment) కారణంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న యువ వైద్యుడికి హై టిబియల్ ఆస్టియోటమీ (HTO)తో పాటు ఆటోలాగస్ కాన్డ్రోసైట్ ఇంప్లాంటేషన్ (ACI) నిర్వహించి కార్టిలేజ్‌ను పునరుద్ధరించారు. ప్రస్తుతం రోగి వేగంగా కోలుకుంటూ సాధారణ జీవితంలోకి తిరిగి వస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ శస్త్రచికిత్సను సీనియర్ జాయింట్ ప్రిజర్వేషన్, స్పోర్ట్స్ ఇంజరీ సర్జన్ డా. రఘువీర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు. 25 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన ఆయన ఈ దేశీయ HTO ఇంప్లాంట్ రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా డా. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, మోకాలి నొప్పి ఉన్న ప్రతి ఒక్కరికీ Knee Replacement అవసరం ఉండదని తెలిపారు. ముఖ్యంగా 55 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు, ప్రారంభ లేదా మధ్యదశ ఆర్థరైటిస్, క్రీడా గాయాలు, కార్టిలేజ్ దెబ్బతినడం లేదా మోకాలి అమరికలో లోపం ఉన్నవారికి Joint Preservation Surgery ఉత్తమ ఫలితాలు ఇస్తుందని చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే సహజ మోకాలిని 10 నుంచి 20 సంవత్సరాల వరకు పరిరక్షించే అవకాశం ఉంటుందని వివరించారు.
హై టిబియల్ ఆస్టియోటమీ ద్వారా టిబియా ఎముక అమరికను సరిచేయడం వల్ల శరీర బరువు దెబ్బతిన్న భాగంపై కాకుండా ఆరోగ్యకరమైన భాగంపై పడుతుందని, దీంతో నొప్పి తగ్గి ఆర్థరైటిస్ పురోగతి మందగిస్తుందని ఆయన తెలిపారు. కేవలం కార్టిలేజ్ చికిత్స కాకుండా ఎముకల అమరికను సరిచేయడం కూడా జాయింట్ ప్రిజర్వేషన్ విజయానికి కీలకమని పేర్కొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. శరత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అభివృద్ధి చేసిన ఈ HTO ఇంప్లాంట్ క్లినికల్ ప్రాక్టీస్‌లో విజయవంతంగా వినియోగంలోకి రావడం దేశీయ వైద్యరంగానికి గర్వకారణమన్నారు. ప్రపంచస్థాయి సాంకేతికతను భారతీయ రోగులకు అందుబాటు ధరల్లో అందించాలన్న మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి ఇది నిదర్శనమని చెప్పారు.
తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు ప్రొ. జి.వి.ఎస్. మూర్తి మాట్లాడుతూ భారతీయ వైద్యుల పరిశోధన ఫలితంగా రూపొందిన ఈ HTO ఇంప్లాంట్ యువ రోగుల్లో సహజ మోకాళ్లను ఎక్కువకాలం పరిరక్షించే చికిత్సలకు కొత్త దిశను చూపుతుందని అభిప్రాయపడ్డారు. ప్రారంభ దశలోనే MRI, Alignment Evaluation, Cartilage Assessment వంటి పరీక్షలు చేయించుకుని ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదిస్తే ఆధునిక Joint Preservation చికిత్సల ద్వారా సహజ మోకాలినే ఎక్కువకాలం కాపాడుకోవచ్చని డా. రఘువీర్ రెడ్డి సూచించారు. ఈ వివరాలను మెడికవర్ హాస్పిటల్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య బృందం వెల్లడించింది.





