శేరిలింగంపల్లి, జూలై 25 (నమస్తే శేరిలింగంపల్లి): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి, యువజన, ప్రజా ఉద్యమాల విజయఫలితమని ఎంసీపీఐ(యూ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ పేర్కొన్నారు. గత నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్తో పాటు దేశవ్యాప్తంగా సాగిన ఆందోళనల ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన అన్నారు. మియాపూర్ స్టాలిన్నగర్లోని పార్టీ కార్యాలయంలో శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందేనన్న డిమాండ్ విద్యార్థి, యువజన ఉద్యమాల ద్వారా బలంగా వినిపించిందన్నారు. ఈ రాజీనామా యువత సాధించిన విజయమని, జెన్జీ ఉద్యమాలకు విప్లవ జేజేలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.






