శేరిలింగంపల్లి, మే 5 (నమస్తే శేరిలింగంపల్లి): గర్భస్రావం అనంతరం తలెత్తిన అత్యంత అరుదైన, ప్రాణాపాయకరమైన వైద్య సమస్యను హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక మల్టీడిసిప్లినరీ చికిత్సతో విజయవంతంగా పరిష్కరించారు. 32 ఏళ్ల యువతి ప్రాణాలను కాపాడటమే కాకుండా, ఆమె గర్భాశయాన్ని సంరక్షించి భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాన్ని కూడా మెరుగు పరిచారు. గతంలో సిజేరియన్ డెలివరీ, పునరావృత గర్భస్రావాల చరిత్ర కలిగిన ఈ మహిళ, ఆరు వారాల గర్భధారణలో మిస్డ్ అబార్షన్ కారణంగా స్థానికంగా డీ అండ్ సీ చేయించుకుంది. అనంతరం 25 రోజులకుపైగా నిరంతర రక్తస్రావంతో బాధపడుతూ అత్యవసర పరిస్థితిలో మెడికవర్ హాస్పిటల్స్‌ను ఆశ్రయించారు. సాధారణ వైద్య చికిత్సకు స్పందించకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
మెడికవర్ నిపుణులు నిర్వహించిన అధునాతన MRI, ఇతర ఇమేజింగ్ పరీక్షల్లో గర్భాశయంలో మూడు ప్రధాన సమస్యలు బయటపడ్డాయి. రిటైన్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ (RPOC) అంటే గర్భస్రావం తర్వాత గర్భాశయంలో మిగిలిపోయిన కణజాలం, యుటెరైన్ ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ (AVM) అంటే అసాధారణ రక్తనాళాల కలయిక, అలాగే పాత సిజేరియన్ మచ్చ వద్ద పలుచబడిన గర్భాశయ పొర (స్కార్ నిచ్ / ఇస్త్మోసీల్). ఈ మూడు సమస్యలు కలిసివచ్చినప్పుడు తీవ్ర రక్తస్రావం, ప్రాణాపాయం, గర్భాశయం తొలగించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోగి వయస్సు, భవిష్యత్ మాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకుని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు గర్భాశయాన్ని కాపాడేలా దశలవారీ ప్రత్యేక చికిత్స ప్రణాళికను అమలు చేశారు.
మొదటగా కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. సాయి తేజ యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే అత్యాధునిక ప్రక్రియ ద్వారా అసాధారణ రక్తప్రవాహాన్ని నియంత్రించి, ప్రాణాపాయకర రక్తస్రావ ప్రమాదాన్ని తగ్గించారు. కన్సల్టెంట్ రోబోటిక్ & లాపరోస్కోపిక్ గైనకాలజికల్ సర్జన్ డా. పేరం పృథ్వి అత్యంత క్లిష్టమైన మినిమల్లి ఇన్వేసివ్ శస్త్రచికిత్స ద్వారా గర్భాశయంలో నిలిచిపోయిన కణజాలాన్ని తొలగించడంతో పాటు, పాత సిజేరియన్ మచ్చ కారణంగా పలుచబడిన గర్భాశయ పొరను (స్కార్ నిచ్) విజయవంతంగా సరిచేశారు. ఈ సందర్భంగా డా. పేరం పృథ్వి మాట్లాడుతూ ఈ కేసు కేవలం ఒక క్లిష్టమైన వైద్య సవాలు మాత్రమే కాదు, ఒక యువతి మాతృత్వ భవిష్యత్తును కాపాడే బాధ్యత కూడా అని అన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణరక్షణ కోసం హిస్టరెక్టమీ చేయాల్సి వస్తుందని, అయితే తమ మల్టీడిసిప్లినరీ ప్రణాళిక, మినిమల్లి ఇన్వేసివ్ శస్త్రచికిత్సతో గర్భాశయాన్ని సంరక్షించగలిగామని, ఇది తమ బృందానికి గొప్ప విజయమని అన్నారు.
డా. సాయి తేజ మాట్లాడుతూ AVM కారణంగా శస్త్రచికిత్స సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగే ప్రమాదం ఉందన్నారు. యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ద్వారా ముందుగానే రక్తప్రవాహాన్ని నియంత్రించడం వల్ల సర్జరీ మరింత సురక్షితంగా పూర్తిచేయగలిగామని, రేడియాలజీ, గైనకాలజీ విభాగాల సమన్వయం ఈ విజయానికి ప్రధాన కారణమని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, ప్రస్తుతం ఆమె పూర్తి కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అరుదైన విజయం మెడికవర్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఇమేజింగ్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, మినిమల్లి ఇన్వేసివ్ గైనకాలజీ నైపుణ్యాలకు నిదర్శనంగా నిలిచింది. అత్యంత క్లిష్టమైన మహిళా ఆరోగ్య సమస్యలకు ప్రాణాలను, మాతృత్వాన్ని కాపాడే ఆధునిక వైద్య సేవలను అందిస్తూ మెడికవర్ హాస్పిటల్స్ మరోసారి తన వైద్య ప్రతిభను చాటుకుంది.





