శేరిలింంగంపల్లి, జూలై 8 (నమస్తే శేరిలింంగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్‌లో నెలకొన్న వరద నీటి కాల్వ ఔట్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ జనప్రియ నగర్‌లో ప్రతి వర్షాకాలంలో ఎదురవుతున్న వరద ముంపు సమస్యను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. వరద నీటి కాలువ ఔట్‌లెట్ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు కాలనీలో చేరి ముంపుకు కారణమవుతోందని, ఈ సమస్య పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని సూచించారు.

కైదమ్మకుంట చెరువు ఔట్‌లెట్ నుంచి అధిక మొత్తంలో నీటి ప్రవాహం వస్తున్నందున దానిని కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త వరద నీటి కాలువ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. భవిష్యత్తులో ముంపు సమస్య తలెత్తకుండా సాంకేతికంగా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, వరద నీటి కాలువ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తిమేర కృషి చేస్తానని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. హఫీజ్‌పేట్ డివిజన్‌తోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు డీఈ శ్రీదేవి, నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ధాత్రి నాథ్ గౌడ్, శ్రీనివాస్, రామకృష్ణతోపాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.





