కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

శేరిలింంగంప‌ల్లి, జూలై 8 (న‌మ‌స్తే శేరిలింంగంప‌ల్లి): కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్‌లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి జై వైఎస్సార్ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. అనంతరం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్ అభిమానులు, సూర్య ఉదయం తెలుగు దినపత్రిక తెలంగాణ ఎడిటర్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, అరుణ రెడ్డి, లక్ష్మీరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కరుమూరి వెంకట్ రెడ్డి, అధికార ప్రతినిధి కొండ రాజీవ్, కడప జిల్లా ఉపాధ్యక్షుడు డీవీ శశికాంత్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కరుమూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగునాట రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్సార్ ముద్ర చెరగదని అన్నారు. నాయకుడు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడ‌న‌టానికి వైఎస్సారే నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ సేవలు, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, డ్వాక్రా రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన మహానేతగా వైఎస్సార్ నిలిచారని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ మాట్లాడుతూ వైఎస్సార్ అంటే ఒక బ్రాండ్ అని వ్యాఖ్యానించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున జయంతి వేడుకల్లో పాల్గొనడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు. వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి, బాలాజీనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గౌడ్ పాల్గొని వైఎస్సార్‌కు నివాళులర్పించారు. బండి మధుసూదన్ రెడ్డి, శివారెడ్డి, ఉపేందర్ రెడ్డి, జీఎల్‌ఎన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ అందించిన పాలన, అభివృద్ధి కార్యక్రమాల‌ను ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఆయన ప్రతి నిర్ణయం ఉండేదని పేర్కొన్నారు. సూర్య ఉదయం తెలంగాణ ఎడిటర్ బాషా మాట్లాడుతూ రైతుల సంక్షేమం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాల ద్వారా వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల కోసం జీవించిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.

అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వెయ్యి మందికి భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గాలి రెడ్డి, తులసి రెడ్డి, సాయినాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చెన్నారెడ్డి, ఆది రెడ్డి, రమణా రెడ్డి, కొండల్ రావు, స్థానిక విలేకరులు శ్యాంసుందర్, క్రాంతికుమార్, సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ కుమార్, చందు, కాలనీ వాసులు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here