శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్ కూకట్‌పల్లి జోన్ డీసీపీ డిసిపి రితిరాజ్ విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి మండలం చామడల గ్రామానికి చెందిన వాల్లెపు వెంకటేష్ అలియాస్ వెంకట్ (25) గత కొంత కాలం కిందట బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి మియాపూర్ ఎఫ్‌సీఐ కాలనీ సమీపంలో నివాసం ఉంటూ స్థానికంగా ఇసుక వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా నిందితుడు కాలనీల్లో తిరుగుతూ అపార్ట్‌మెంట్లు, ముఖ్యంగా వాచ్‌మన్ గదులు లేదా తలుపులు లాక్ చేయని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, ఇళ్లలో ఉండే వారి కదలికలను గమనించి అదను చూసి ఇళ్లలోకి ప్రవేశించేవాడు. అనంతరం ఇళ్లలో ఉండే బంగారు, వెండి ఆభరణాలు, నగదును తస్కరించి ఉడాయించేవాడు. ఈ విధంగా అతను గతంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో దొంగతనాలకు పాల్పడి జ్యుడిషియల్ కస్టడీకి వెళ్లి మళ్లీ బయటకు వచ్చి యథావిధిగా దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.

మాదాపూర్‌లో 16, కేపీహెచ్‌బీ 5, కూకట్‌పల్లి 3, మియాపూర్ 5, బాచుపల్లి 3, దుండిగల్ 2, చందానగర్ 3, ఆర్సీ పురం 3, బాలానగర్ 1, గచ్చిబౌలి 1, జగద్గిరిగుట్ట 1, ఎల్‌బీ నగర్ 1, తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో 1 కేసు నమోదయ్యాయి. అలాగే ఇటీవల మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఇతనిపై 3 కేసులు నమోదు కాగా, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో 1 కేసు నమోదైంది. నిందితుడు శుక్రవారం ఉదయం సమయంలో మియాపూర్ మయూరినగర్ ప్రాంతంలో తన యాక్టివా వాహనంపై ప్రయాణిస్తూ పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అతను చేసిన నేరాలను అంగీకరించాడు. ఈ క్రమంలో అతని నుంచి పోలీసులు 4 గ్రాముల బంగారు ఆభరణాలు, 607 గ్రాముల వెండి ఆభరణాలు, ఓ యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్‌కు తరలించారు.

నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకోవడంతో వారిని డీసీపీ అభినందించారు. ప్రజలు ఇళ్లలో విలువైన వస్తువులను ఉంచరాదని, బ్యాంకు లాకర్లలో భద్ర పరుచుకోవాలని, ఇళ్లలో లేకపోతే కచ్చితంగా తాళం వేయాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజలు తమ ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఏసీపీ రవి కిరణ్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో శివప్రసాద్, డిఐ రమేష్ నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





