డిప్రెషన్‌తో తల్లి ఆత్మహత్య‌.. శిశువుకు స్వల్ప గాయాలు..

శేరిలింగంప‌ల్లి, జూన్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మయూరి నగర్‌లో శుక్రవారం మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈషా సాహూ (37), ప్రస్తుతం మయూరి నగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమె తన ఆరు నెలల కుమార్తెతో కలిసి అపార్ట్‌మెంట్ 6వ అంతస్తు నుంచి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఈషా సాహూ అక్కడికక్కడే మృతి చెందగా, శిశువుకు స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న ఫెన్సింగ్ కారణంగా పాప ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు ప్రాథమిక సమాచారం. గాయపడిన చిన్నారిని వైద్య పరీక్షలు, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈషా సాహూకు 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు భర్తతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వయస్సు 8 సంవత్సరాలు కాగా, రెండో కుమార్తె వయస్సు 6 నెలలు. భార్యాభర్తలు ఇద్దరూ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ నివసిస్తున్నారు. ప్రాథమిక విచారణలో రెండో బిడ్డ జననం అనంతరం ఈషా సాహూ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here