శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన బుధవారం కుత్బుల్లాపూర్ జోన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు, విభాగాల అధిపతులు (HODs), డిప్యూటీ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పౌర సేవలు, ఆదాయ వసూళ్లు, ఇంజనీరింగ్ పనులు, టౌన్ ప్లానింగ్, పారిశుధ్యం, ఎంటమాలజీ పనులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, అధికారులలో జవాబుదారీతనం ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను నాణ్యతతో, గడువులోగా పరిష్కరించాలని, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వేగం, సామర్థ్యాన్ని పెంచాలని, ఏప్రిల్ 30 నాటికి నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలన్నింటినీ పూర్తి చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల జాబితాను నెలాఖరులోగా సమర్పించాలని అన్నారు. అలాగే కొత్త పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని, జూన్ 2 నాటికి నాలాల పూడికతీత, ఖాళీ స్థలాలకు ప్రహరీ గోడల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, ఫుట్‌పాత్ నిర్మాణం, మరమ్మత్తులు, సీసీ, బీటీ రోడ్లు, వరద నీటి కాలువలు, రోడ్డు మరమ్మత్తులు, జంక్షన్ల అభివృద్ధి, మీడియన్లకు పెయింటింగ్, ఆక్రమణల తొలగింపు తర్వాత రోడ్డు విస్తరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

భవన నిర్మాణ అనుమతులను గడువులోగా (SLA) మంజూరు చేయాలని, అన్ని ఖాళీ స్థలాలకు నెలాఖరులోగా హద్దులు నిర్ణయించి, గేట్లతో కూడిన ప్రహరీ గోడలు నిర్మించాలని, 1.5 – 2 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఖాళీ స్థలాల్లో థీమ్ పార్కులను అభివృద్ధి చేయాలని, ప్రతి సర్కిల్‌లో వెహికల్ మౌంటెడ్ స్ప్రేయింగ్ మిషన్లను అందుబాటులో ఉంచాలని, ప్రతి 10 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ జరిగేలా షెడ్యూల్ పాటించాలని, డ్రోన్ స్ప్రేయింగ్, ఆయిల్ బాల్స్ వదలడం, గుర్రపుడెక్క తొలగింపు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని కఠినంగా అమలు చేయాలని, అన్ని ఫైళ్లను ఖచ్చితంగా e-Office ద్వారానే ప్రాసెస్ చేయాలని, ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండకూడదని అన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ, ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని కమిషనర్ ఆదేశించారు. కుత్బుల్లాపూర్ జోన్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పౌర సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.





